ప్రధాని నరేంద్రమోదీ ఆస్ట్రియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ చాన్స్‌లర్ కర్ల్ నెహమ్మార్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్ సంక్షోభాలు చర్చకు రాగా, ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో సమస్యలు పరిష్కారం కావని అభిప్రాయప డ్డారు. ఎక్కడైనా అమాయకు ల ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నాకు లభించిన ఘన స్వాగతానికి ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని స్థాయిలో ఆస్ట్రియాను సందర్శించాను. భారత్-ఆస్ట్రియా మధ్య ఫలప్రదమైన దౌత్యపరమైన చర్చలు జరిగాయి. భారత్- ఆస్ట్రియా పరస్పర సహకారాన్ని అందించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే దశాబ్దంలో సహకారం కోసం బ్లూప్రింట్‌ను తయారు చేసుకున్నాయి. యుద్ధభూమిలో సమస్యలకు పరిష్కారాలు దొరకవు. భారత్- ఆస్ట్రియా దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ సమావేశం ఐరోపాలో శాంతి, స్థిరత్వానికి దిశానిర్దేశం చేసింది. భారత్- ఆస్ట్రియా ద్వైపాక్షిక సంబంధాలు 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నా పర్యటన జరగడం ఆనందంగా ఉంది. మొబిలిటీ, మైగ్రేషన్ పార్టనర్‌షిప్‌పై ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది. ఇది చట్టపరమైన వలసలను, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తరలిం చడాన్ని సులభతరం చేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, నీరు, వ్యర్థాల నిర్వహణ, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాం అని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్, రష్యా శాంతి ప్రక్రియలో భారత్ ఎంతో ప్రధానమైనదని, అది శక్తివంతమైన ప్రభావవంతమైన పాత్రను పోషించగలదని ఆస్ట్రియన్ చాన్స్‌లర్ కర్ల్ నెహమ్మార్ అన్నారు. అదే సమయంలో తమ దేశం తటస్థ విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు.