
భారతీయ విద్యార్థులకు అమెరికా ఇచ్చే విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారులపై కక్ష గట్టినప్పటికీ విద్యార్థి వీసాలు తగ్గడానికి మాత్రం ఆయన కారణం కాదని తెలుస్తున్నది. అమెరికా ప్రభుత్వం మొత్తంగానే విద్యార్థి వీసాలను తగ్గించగా, ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థుల అవకాశాలు కూడా తగ్గిపోయాయి. 2018లో 42 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు (ఎఫ్-1) లభించగా, ఆ సంఖ్య 2024 నాటికి 86 వేలకు పెరిగింది. కానీ అంతకుముందు సంవత్సరాలు 2023లో 1.31 లక్షల మందికి, 2022లో 1.15 లక్షల మందికి విద్యార్థి వీసాలు లభించాయి.

2014లో దాదాపు 6 లక్షల వీసాలు మంజూరు చేసిన అధికారులు 1.73 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 2023లో 4.45 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందగా, 2.53 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. ఎఫ్-1 వీసాల దరఖాస్తుల తిరస్కరణ 41 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థి వీసాలు పొందిన దేశంగా భారత్ నిలిచింది. కానీ 2018, 2023 మధ్య ఎఫ్-1 వీసాలు మంజూరు రేటు 65.03 శాతం నుంచి 63.74 శాతానికి పడిపోయింది. ఇక భారతీయుల దరఖాస్తుల తిరస్కరణ రేటు 34.97 శాతం నుంచి 36.26 శాతానికి పెరిగింది.
