బ్రిటన్ పార్లమెంటులోని ప్రభువుల సభకు ఎంపికైన ఉదయ్ నాగరాజ్ ను యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో లండన్ లోని ప్రముఖ తెలుగు రెస్టారెంట్ హైదరాబాద్ బావర్చీ ఈస్ట్ హోం లో లార్డ్ ఉదయ్ నాగరాజ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ లార్డ్ ఉదయ్ నాగరాజ్‌ను విశిష్ఠ సేవలను గుర్తించి సన్మానించడం గర్వకారణమని తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రవాస తెలుగు సమాజం ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నదని సభ్యులు తెలిపారు.


లార్డ్ ఉదయ్ నాగరాజ్ మాట్లాడుతూ యునైటెడ్ కింగ్డమ్ లో తెలుగు సమాజం ఐక్యంగా ఉంటూ సమాజ సేవ తెలుగు సంసృతి పరిరక్షణ, యువత అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తెలుగు సంఘాలు సమాజ శ్రేయస్సు కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సంఘ సేవకులు తరుణ్ ఘలాటి తో పాటు తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలంగాణ ఎన్నారై ఫోరం, డార్ట్ ఫోర్డ్ తెలంగాణ అసోసియేషన్,తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ జాగృతి, వరంగల్ ఎన్నారై ఫోరం ప్రతినిధులు పలువురు కార్యక్రమంలో పాల్గొని లార్డ్ ఉదయ్ నాగరాజ్ కి అభినందనలు తెలిపారు.


ఉదయ్ నాగరాజ్ గురించి: తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం నుంచి వరంగల్, హైదరాబాద్, రామ్‌టెక్‌లలో చదువుకుని.. బ్రిటన్ లో ఉన్నత చదువులు చదివి, అక్కడ రాజకీయ ఔత్సాహికులకు ఒక సంస్థ పెట్టి శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ తీసుకున్నవారిలో కొందరు మేయర్లు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈయన కొన్నేళ్ల క్రితం బ్రిటన్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్‌కు పోటీచేసినా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. పాలనారంగం, ఇతర రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ను హౌస్‌ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికచేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సిఫారసుతో ఆ దేశ రాజు చార్లెస్ ఆయన్ను ఈ సభకు నామినేట్ చేశారు. ఈ సభకు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం.






























