అమెరికాలో భారత సంతతి మహిళా న్యాయవాదికి అరుదైన గౌరవం దక్కింది. మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రఖ్యాత భారతీయ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తిని ప్రతిష్టాత్మక మేరీల్యాండ్ బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించింది. ప్రతియేటా మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రముఖ వ్యక్తిని ఇలా సత్కరించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే ఈ ఏడాది షీలా మూర్తికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇక ఇలాంటి వారు తమ కృషి, అంకిత భావంతో వ్యాపారాల్లో గొప్ప విజయాలను తీసుకురావడంతో పాటు వారి సంస్థలను, ఉద్యోగులను, కమ్యూనిటీని సుసంపన్నం చేస్తారని మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల షీలా మూర్తి హర్షం వ్యక్తం చేశారు. కాగా, షీలా మూర్తి ప్రస్తుతం మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేస్తున్న లా సంస్థకు అధ్యక్షురాలిగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో క్రియాశీల సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

















