గత 8 ఏళ్లలో 2.4 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేశారని తాజాగా వెలువడిన ప్రభుత్వ డేటా చెబుతోంది. రాజ్యసభ లో తాజాగా ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 2014 నుంచి 2022 వరకు ఎనిమిదేళ్లలో 2,46,580 మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చేశారు. ఇక ఢిల్లీ నుంచి అత్యధికంగా 60,414 మంది తమ పాస్‌పోర్టులను సరెండర్ చేయడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ (28,117), గుజరాత్ (22,300), గోవా (18,610), కేరళ (16,247) ఉన్నాయి. రాజ్యసభలో రాష్ట్రాలవారీగా పాస్‌పోర్టుల సరెండర్‌పై తలెత్తిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇచ్చారు.మొత్తంగా గడిచిన ఎనిమిది ఏళ్లలో 2,46,580మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే 2019-22 మధ్య 35 దేశాల్లోని 24వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చివేసినట్లు ఆయన తెలిపారు.














