దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని లెజెండరీ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. ఇండియన్-2 సినిమా షూటింగ్లో భాగంగా కమల్‌హాసన్ విజయవాడ వచ్చారు. ఇందులో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ ఒక సినిమా లెజెండ్ వేడుకను మాత్రమే కాకుండా, సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమపై వేసిన చెరగని ముద్రకు ప్రతీక. ఈ మహత్తర వేడుకని చూసేందుకు సూపర్ స్టార్ అభిమానులు, శ్రేయోభిలాషుల పెద్ద ఎత్తున పాల్గొని కృష్ణపై తమ ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్ కు సూపర్‌స్టార్ కృష్ణ గారు చేసిన కృషికి ఈ విగ్రహం కలకాలం నిలువెత్తు నిదర్శనంగా, తరతరాల మధ్య వారధిగా నిలిస్తుంది. విజయవాడలో ఉదయం జరిగిన వేడుకలు సూపర్‌స్టార్ కృష్ణ గారి శాశ్వతమైన వారసత్వాన్ని పునరుద్ఘాటించాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేవినేని అవినాష్, పలువురు రాజకీయ నేతలతో పాటు కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు.















