Skip to main content

Namaste NRI

ప్రముఖ గాయని ఎస్. జానకి ఇకలేరు

భారతీయ చలనచిత్ర రంగాన్ని తన మధుర గాత్రంతో దశాబ్దాల పాటు ఏలిన దక్షిణ భారత గాన కోకిల ఎస్. జానకి (88) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కర్ణాటకలోని మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. కొడుకు దూరమైన కొన్ని నెలలకే జానకమ్మ కూడా కన్నుమూయడంతో సంగీత లోకంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది.జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన మేనమామ, ఆమెను మద్రాసు (చెన్నై) తీసుకువెళ్లారు. అది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 1957లో విధియిన్ విలైయాట్టు అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆమె, అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు.

తెలుగు మాతృభాష అయినప్పటికీ జానకి కేవలం ఒక భాషకే పరిమితం కాలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా దాదాపు 20కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో 48,000 కంటే ఎక్కువ పాటలు పాడి రికార్డు సృష్టించారు. మైమరపించే మెలోడీలు, ఉరకలెత్తించే మాస్ పాటలు, భక్తి గీతాలు, ఇలా ఆమె పాడని జానర్ లేదు. పాటలో భావాన్ని పలికించడంలో, వెండితెరపై నటి హావభావాలకు అనుగుణంగా స్వరాన్ని మార్చడంలో జానకమ్మకు ఆమే సాటి. చిన్న పిల్లల గొంతును సైతం అలవోకగా అనుకరిస్తూ ఆమె పాడిన పాటలు శ్రోతలను అబ్బురపరిచాయి. అందుకే పరిశ్రమ ఆమెను ప్రేమగా క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అని పిలుచుకునేది. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారామె. పది నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, ఒడిశా నుంచి ఒకటి, 1986లో కలైమామణి అవార్డు స్వీకరించారు.

Social Share Spread Message

Latest News