తమ సుప్రీం నేత, తన తండ్రి అయతొల్లా ఖమేనీని హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక రాతపూర్వక సందేశాన్ని విడుదల చేస్తూ ఇరాన్ ప్రజల ఈ డిమాండ్‌ను తప్పక నెరవేర్చవలసిందేనని పేర్కొన్నారు. కాగా, గత నెలలో అమెరికాతో జరిగిన 14 పాయింట్ల అవగాహన ఒప్పందాన్ని కనుక అగ్రరాజ్యం ఉల్లంఘించి దాడులు చేసినా, పూర్తి స్థాయి రక్షణ కోసం సన్నద్ధంగా ఉన్నామని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు.

అమెరికాపై టెహ్రాన్‌కు అస్సలు నమ్మకం లేదని, చర్చల సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌కు అదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిపారు. హొర్ముజ్ జలసంధి పూర్వ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, టెహ్రాన్‌లో వినిపించిన భారీ పేలుడు శబ్దం పాత ప్రమాదకరమైన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేసే ప్రక్రియ వల్ల ఏర్పడిందని ఇరాన్ అధికారులు ప్రకటించారు.





























