సాయితేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం రిపబ్లిక్. ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. దేవాకట్టా దర్శకత్వం వహించారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. రిపబ్లిక్ ముందస్తు వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమాలు మొదలు పెట్టాక నేను మా అన్నయ్య సహకారం తీసుకోలేదు. మా మేనల్లుళ్లు తేజ్, వైష్టవ్ కూడా సొంత కాళ్లపై నిలబడాలనే సూచించా. అందుకే వాళ్ల సినిమాల వేడుకలకి నేను గతంలో హాజరు కాలేదు అన్నారు. మా అక్క కొడుకులైన తేజ్, వైష్టవ్ సినిమాల్లోకి వస్తామన్నప్పుడు నటనలో శిక్షణ ఇప్పించా. సొంత నిర్ణయాలతోనే ప్రయాణం చేయాలని సూచించా. ఈ రోజు ప్రత్యేకించి ఈ వేడుకకి రావడానికి కారణం నిర్మాతలు. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. అందరూ ఆనందంగా ఉండాల్సిన విడుదల సమయంలో తేజ్ మోటర్‌బైక్ ప్రమాదానికి గురికావడం బాధకరమైన విషయం. నిర్మాతలకి ఆ హీరో అందుబాటులో లేని లోటు కనిపించకుండా ఏదో ఒకటి చేయాలని ఈ వేడుకకి వచ్చా. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయి తేజ్ నటించిన ఈ సినిమా బాగా వచ్చిందని అర్థమవుతోంది ట్రైలర్ చూస్తుంటే, అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
ఈ వేడుకల్లో కథానాయకుడు వైష్టవ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్, దర్శకుడు హరీష్‌శంకర్, దేవా కట్టా, క్రిష్ జాగర్లమూడి, దిల్‌రాజు, గోపీచంద్ మలినేని, మారుతి, బి.వి.ఎస్.రవి, కిషోర్ తిరుమల, రవివర్మ, మనోజ్ నందం, శ్రీకాంత్, సుకుమార్, కళామందిర్ కల్యాణ్, నవీన్ రెడ్డి, నవీన్ పసునూరి, శ్రీధర్, ప్రసాద్ నిమ్మకాయల తదితరులు పాల్గొన్నారు.














