వైద్యరంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న అవయవాల కొరతను అధిగమించే దిశగా కీలక ముందడుగు పడిరది. మూత్రపిండాల మార్పిడి చికిత్సలో అమెరికా వైద్యులు వినూత్న ప్రయోగం చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పంది మాత్రపిండాన్ని మనిషికి అమర్చారు. ఇది సత్ఫలితాన్నిచ్చింది. మానవ మూత్రపిండం లాగే పనిచేసింది. మానవ రోగ నిరోధక వ్యవస్థ పంది కిడ్నీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనబర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. లక్షల మందికి కిడ్నీ మార్పిడి చికిత్స అవసరం. అయితే, అవసరమైనన్ని కిడ్నీలు లేక చికిత్సలు ఆలస్యం అవుతున్నాయి. ఫలితంగా చాలా మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ప్రయోగం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది.
నిజానికి ఈ తరహా ప్రయోగాలు 17వ శతాబ్దం నుంచే జరుగుతున్నాయి. 20వ శతాబ్దంలో మరణం ఖాయమైన ఓ పసికందుకు కొండముచ్చు గుండెను అమర్చి 21 రోజుల పాటు బతికించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీంతో నాటి నుంచి ఊపందుకున్న ఈ ప్రయోగం తాజా విజయంతో మరో స్థాయికి చేరినట్లుయింది.
న్యూయార్క్‌కు చెందిన వైద్యులు ఈ ప్రయోగంలో భాగంగా మానవ ఇమ్యూనిటీకి సహకరించేలా మొదట పంది జన్యువుల్లో కొంత మార్పులు చేశారు. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో పాటు బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు శస్త్ర చికిత్స చేసి పంది కిడ్నీని అమర్చారు. మూడు రోజుల పాటు పరిశీలించారు. మనిషి కిడ్నీ మాదిరే పంది మూత్రపిండం పనిచేసిందని శస్త్ర చికిత్సకు నేతృత్వం వహించిన సర్జన్ మాంట్గోమరి తెలిపారు. జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడంపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజా ప్రయోగం ఈ పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చిందని వారు తెలిపారు.














