Namaste NRI

ఆస్ట్రేలియాలో ఘనంగా తెలుగు అష్టావధాన కార్యక్రమం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తెలుగు అష్టావధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. జనరంజని రేడియో సంస్థ, శ్రీవేద గాయత్రి పరిషత్‌, సంగీత భారతి న్యూజిలాండ్‌ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెల్‌బోర్న్‌ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి కల్యాణ చక్రవర్తి అవధానం చేశారు. సాహఙత్యరత్న తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ కార్యక్రమానికి సంచాలకులుగా వ్యవహరించారు.

సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో 3 గంటలకు పైగా ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం నాలుగు ఆవృత్తులతో (రౌండ్స్), 20 మంది పృచ్ఛకులతో, ఉన్నత సాహిత్య ప్రమాణాలతో కొనసాగింది.తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు. ఈ సందర్భంగా అవధాని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలక మండలి సభ్యులు సంధ్యారెడ్డి అభినందించారు. తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించగలమని తెలిపారు.

ఈ సందర్భంగా 11 ఏళ్ల కృష్ణ సుహాస్ తటవర్తి అనర్గళంగా చెప్పిన గజేంద్రమోక్షం కథ సభా సదుల మనసులను రంజింపచేసినది. ఆగస్టు 30వ తేదీన మెల్‌బోర్న్‌ నగరంలో కూడా కల్యాణ చక్రవర్తితో మరో అష్టావధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జనరంజని కల్చరల్ కో ఆర్డినేటర్ స్వర్ణలత సీతంరాజు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events