
శివకార్తీకేయన్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మదరాసి. ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ నేను ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావిస్తా. మదరాసి విషయంలో అదే భావనతో ఉన్నా. ఇదొక డిఫరెంట్ కథ. దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ఈ సినిమా కథ ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. విలన్ ఈ సినిమాలో హీరోని మదరాసి అని పిలుస్తుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం అన్నారు. తమిళనాడు నేపథ్యంలో కథ నడిచినా సినిమా కంటెంట్ అందరికి కనెక్ట్ అవుతుందని, మనదేశంలో కొత్తగా ఉత్పన్నమైన ఓ సమస్య ఆధారంగా కథ రాసుకున్నానని, అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఇదని మురుగదాస్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది.















