భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో దశాబ్దాల పాటు అలరించిన గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కు కేరళలో అరుదైన గౌరవం దక్కింది. పాలక్కాడ్‌లోని వి.టి. భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్‌లో ఆయన 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విశేషంగా జరిగింది. సంగీతానికి భాషా, ప్రాంతీయ భేదాలు లేవని మరోసారి కేరళ ప్రజలు నిరూపించారు. పరభాషా గాయకుడైనప్పటికీ ఎస్పీబీపై తమకున్న అపారమైన అభిమానాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా తెలియజేశారు. ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ రూపొందించిన ఈ విగ్రహం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ కార్యక్రమంలో ఎస్పీబీ తనయుడు చరణ్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకులు మనోజ్, చిత్ర, హరిహరన్, సుజాత్ మోహన్, ఉన్ని మీనన్, విజయ్ ఏసుదాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడిగానే కాకుండా, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడిగానూ విశేష సేవలు అందించారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. మలయాళం లోనూ ఆయన ఎన్నో గుర్తుండిపోయే పాటలు పాడారు. 2020 సెప్టెంబర్ 25న కరోనా కారణంగా ఆయన కన్నుమూసినా, తన అమర గానంతో సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కేరళలో విగ్రహావిష్కరణతో ఆయనకు మరొక చిరస్మరణీయ గౌరవం దక్కిందని అభిమానులు భావిస్తున్నారు.

గతంలో హైదరాబాద్‌లో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుపై వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.రవీంద్ర భారతిలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో ప్రాంతీయ వివాదాలు తలెత్తాయి. అయితే కేరళలో మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ఘనంగా కార్యక్రమం నిర్వహించడం విశేషంగా నిలిచింది.















