ప్రముఖ గాయని, సంగీత సంచలనం ఆశా భోంస్లే (92) ఇకలేరు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ఈ విషయాన్ని ద్రువీకరించారు.ఆమె అంత్యక్రియలు ముంబయిలోని శివాజీ పార్క్ లో సోమవారం నిర్వహిస్తామని తెలిపారు. ఆశా భోస్లే మరణంతో సంగీత ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే అంటే కేవలం ఒక పేరు కాదు.. ఒక శకం. దాదాపు ఎనిమిది దశాబ్దాలకు పైగా తన గాత్రంతో కోట్లాది మందిని అలరిస్తూ, వేల సంఖ్యలో పాటలకు ప్రాణం పోసింది. ఆశా భోంస్లే మృతి పట్ల సినిమా, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆశా భోస్లే జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, రంగస్థల నటుడు. ఇంట్లోనే సంగీత వాతావరణం ఉండటంతో.. చాలా చిన్న వయసులోనే ఆశా భోస్లే సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. గాయనిగా ఆమెది సుదీర్ఘ ప్రయాణం. వేలాది పాటలతో శ్రోతలను అలరించారు. ఆమె చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే , మహారాష్ట్ర భూషణ్, భంగా విభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి.ఆశా భోస్లే కేవలం హిందీకే పరిమితం కాలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఇలా దాదాపు 20కి పైగా భారతీయ మరియు విదేశీ భాషల్లో ఆమె వేల పాటలు పాడారు.తెలుగులో కూడా ఆశా భోస్లే గళం సుపరిచితమే. ‘ప్రేమ లేఖలు’ సినిమాలో ‘ఓ పిల్లా.. ఏయ్ పిల్లా..’ వంటి పాటలు ఆమె ఎంత మాధుర్యంతో పాడగలరో నిరూపిస్తాయి.















