ప్రపంచానికి ఇది గుడ్‌న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురుచూసిన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఒక ప్రకటన చేశారు. ఇకపై హార్ముజ్ జలసంధి అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పది రోజులపాటు కాల్పుల విరమణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నంత కాలం జలసంధి తెరిచి ఉంచే అవకాశం ఉంది. లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలు నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాం. ఈ ఒప్పందం అమలులో ఉన్నంతకాలం హార్ముజ్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని రకాల వాణిజ్య నౌకల్ని అనుమతిస్తాం. ఈ అంశంపై ఇప్పటికే అన్ని పోర్టులకు సమాచారం అందించాం. సంబంధిత రూట్ల గురించి కూడా తెలియజేశాం అని అరాగ్చీ పేర్కొన్నారు.

ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. హార్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని ప్రకటించారు.ఇరాన్ ఈ నిర్ణయానికి తీసుకోవడానికి లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే కారణం. దీనికి కూడా ట్రంప్ తనవంతు ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఇరు దేశాల అధ్యక్షుల్ని చర్చలు జరిపేందుకు ఒప్పిస్తానని ట్రంప్ అన్నారు. హార్ముజ్ జలసంధి అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని అనేక దేశాల చమురు కష్టాలు తీరుతాయి. అంతేకాదు, ఆహారం, ఎరువులు, ఔషధాలు వంటివి కూడా అందుబాటులోకి వస్తాయి. మరోవైపు ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.















