అదిగో ఒప్పందం, ఇదిగో దిగ్బంధనం ఎత్తేస్తున్నాం, హొర్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు తమ దేశాలకు వెళ్లిపోవచ్చు అంటూ ఆర్భాటపు ప్రకటను చేసిన అమెరికా అధ్యక్షుడు, తీరా కార్యాచరణకు వచ్చేటప్పుటికి తుస్ మనిపించారు. దీంతో ఇరాన్, అమెరికా అధినేతల వైఖరిని చూస్తే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే పరిస్థితి కన్పించడం లేదు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి 60 రోజుల ముసాయిదా సిద్ధమైందని, ట్రంప్ అనుమతి ఇవ్వడమే మిగిలి ఉన్నదని తొలుత ప్రచారం జరిగింది. ఇదిగో కొన్ని గంటల్లోనే ఒప్పందం అన్నట్టు ట్రంప్ కూడా ప్రకటించారు.

అయితే ఇరాన్‌తో ఒప్పందానికి సంబంధించి వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. అమెరికా ఆంక్షలూ లేవు,ఇరాన్‌తో ఒప్పందమూ లేదు అని సమావేశం అనంతరం ఒక అధికారి వ్యాఖ్యానించారు. దీంతో రెండు దేశాల శాంతి ఒప్పందం కొనసాగుతుందని ఎదురుచూసిన ప్రపంచ దేశాలకు మళ్లీ తీవ్ర నిరాశ ఎదురైంది. ఒప్పందం కుదిరే అంత్య దశకు చేరుకున్నప్పటికీ స్తంభింపచేసిన ఇరాన్ నిధుల విడుదలకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు.





























