అమెరికా విజిట్ వీసా అపాయింట్‌మెంట్ పొందాలంటే 2024 వరకు వేచివుండాల్సిందే. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సగటు నిరీక్షణ సమయం దాదాపు 500 రోజులుగా ఉంది. ఎవరైనా ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వారికి 2024 మార్చి`ఏప్రిల్‌లో అపాయింట్ లభిస్తుంది. న్యూఢల్లీిలోని యూఎస్ కాన్సులేట్‌లో వీసా అపాయింట్ మెంట్ విజిటర్ వీసాలకు 522 రోజులు, విద్యార్థుల వీసాలకు 471 రోజులు నిరీక్షణ వ్యవధిగా చూపుతోంది. లొకేషన్‌ను ముంబైకి మార్చి పరిశీలిస్తే, విజిటర్ వీసా కోసం 517 రోజులు, విద్యార్థి వీసా అపాయింట్ మెంట్‌కు 10 రోజులు వేచి వుండాలని వెబ్‌సైట్‌ను బట్టి తెలుస్తోంది. ఇతర నాన్ ఇమిగ్రేషన్ వీసాలు ఢల్లీి నుంచి 198 రోజులు, ముంబై నుంచి 72 రోజుల నిరీక్షణ సమయంలో ఉన్నాయి.
ఒక్క అమెరికానే కాదు, కెనడా, యూకే లాంటి దేశాల్లోనూ అనుకొన్న సమయానికి వీసా దొరకటం కష్టంగా మారిందని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు. చాలా యూరోప్ దేశాలు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని తెలిపారు. స్వీడన్ లాంటి కొన్ని దేశాలే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నాయని వివరించారు. కరోనా తర్వాత ట్రావెల్ డిమాండ్ పెరగటం, వీసాకు దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం వల్లే వీసా అపాయింట్‌మెంట్లలో ఆలస్యం అవుతున్నదని నిపుణులు చెప్తున్నారు.














