ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (57) మరో అద్భుతాన్ని సాధించారు. తన కంపెనీ నిర్మించిన రాకెట్‌లో నింగిలోకి పయనించి అంతరిక్ష అంచులు స్పృశించి వచ్చాడు. 18 నిమిషాలు సాగిన ఈ పయనాన్ని విజయవంతంగా ముగించి భూమికి వచ్చిన అనంతరం ఇది తనకు అద్భుతమైన రోజని ఆనందం వ్యక్తం చేశారు.
అమెరికాకు చెందిన తొలి వ్యోమగామి పేరిట బెజోస్ కంపెనీ బ్లూఆరిజన్స్ రూపొందించిన న్యూషెపర్డ్ నౌక మంగళవారం సాయంత్రం ఆరున్నరకు (భారతీయ కాలమానం) పశ్చిమ టెక్సాస్ నుంచి నింగిలోకి పయనించింది. బ్రాన్సన్ నౌక కన్నా 10 కిలోమీటర్లు అధికంగా న్యూషెపర్డ్ భూమికి 106కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. పయనంలో భాగంగా నౌక మాక్3 స్పీడ్ (ధ్వనివేగం కన్నా మూడు రెట్లు అధికం)ను సాధించింది. నౌక బయలుదేరిన 2 నిమిషాలకు వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యారు. అనంతరం సీటు బెల్టులను తొలగించి భార రహితస్థితిని ఆస్వాదించారు. వ్యోమనౌక ప్రయాణం ప్రారంభమైన 6 నిమిషాలకు క్యాప్స్యూల్ నుండి విడిపోయిన బూస్టర్ రాకెట్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
ఈ యాత్రలో మరో విశేషం కూడా ఉంది. బెజోస్‌తో పాటు పయనించిన యాత్రికుల్లో 82 ఏళ్ల వృద్ధురాలు ఒకరు కాగా 18 ఏళ్ల యువకుడు మరొకరు. దీంతో స్పేస్‌లోకి వెళ్లివచ్చిన అత్యంత పిన్న వయస్కుడు, వృద్ధ మహిళగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు. వీరి ముగ్గురితో పాటు బెజోస్ సోదరుడు మార్క్ కూడా యాత్రలో పాల్గొన్నారు. తాజా అంతరిక్ష యానంతో స్పేస్‌లోకి సక్సెస్ పుల్‌గా వెళ్లివచ్చిన మరో కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ సరసన బెజోస్ నిలిచారు.