చైనాను మరో కొత్త రకం వైరస్ భయపెడుతున్నది. చైనాలో మొదటిసారిగా ఓ వ్యక్తికి మంకీ బీ వైరస్ (బీవీ) సోకినట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. బాధితుడు 53 ఏండ్ల పశువుల వైద్యుడని పేర్కొంది. వైరస్ సోకిన రెండు మకాక్యూ జాతి కోతుల మృతదేహాలను ముట్టుకోవడంతో ఆయనకు ఈ వ్యాధి వ్యాపించిందని వెల్లడించింది. వికారంతో కూడిన వాంతులు పెరుగడంతో బాధితుడు పలు దవాఖానల్లో చికిత్స తీసుకున్నాడని, పరిస్థితి విషమించడంతో మే 27న మరణించాడని వివరించింది. అయితే, మృతుని నుంచి ఇతరులకు ఈ వైరస్ సోకినట్టు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. మకాక్యూ జాతి కోతుల ద్వారా సోకే ఈ మంకీ బీ వైరస్ సోకిన వారికి సరైన చికిత్స అందించకపోతే మరణించే ప్రమాదం 70`80 శాతం వరకు ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి చికిత్సకు సరైన ఔషధాలు లేవు.