రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఏ.ఆర్.రెహమాన్ స్వరకర్త. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌నివ్వగా, బోనీ కపూర్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో క్రీడా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ దర్శకుడు బుచ్చిబాబు రంగస్థలం చిత్రానికి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతున్నది. ఈ సినిమాకు గొప్ప టీం కుదిరింది. నా కెరీర్లో ఇంత త్వరగా ఏ.ఆర్.రెహమాన్‌తో పనిచేస్తానని అనుకోలేదు. ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అవుతుంది అన్నారు. ఈ కథ చాలా బాగుందని, ఇప్పటికే మూడు ట్యూన్స్ సిద్ధం చేశానని ఏ.ఆర్.రెహమాన్ తెలిపారు. ఈ సినిమా సాకారం కావడానికి ప్రధాన కారణం తన గురువు సుకుమారే నని, రామ్‌చరణ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప చిత్రాన్ని అందిస్తానని దర్శకుడు బుచ్చిబాబు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శంకర్, సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: అవినాష్ కొల్లా, పాటలు: చంద్రబోస్, అనంత శ్రీరామ్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా.