ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాకు ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఈయూ, ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇందులో ఒకటి తమ గగనతలం మీద నుంచి రష్యా విమానాలపై నిషేధించాయి. తాజాగా అగ్రరాజ్యం సైతం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా గగనతలంలోకి రష్యా విమానాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యా ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచి ఒంటిరి చేయడానికి మా మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో మేము భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. ఈ విషయంలో తమ మిత్రులతో కలిసి పనిచేస్తామన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందన్నారు. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని అమెరికా దాన్ని మిత్రపక్షాలు రక్షించుకుంటాయని స్పష్టం చేశారు. ఎంతో దైర్యంతో రష్యాపై ఉక్రెయిన్లు పోరాడుతున్నారు. యుద్ధం వల్ల పుతిన్ ప్రస్తుతం లాభపడవచ్చు. కానీ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రష్యన్ ఓలిగార్చ్‌ల నేరాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓలిగార్చ్ ల లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ప్రైవేటు జెట్‌లు స్వాధీనం చేసుకునేందుకు యూరోపియన్ మిత్రదేశాలతో చేతులు కలుపుతున్నామన్నారు. యుద్దం ట్యాంకులతో కీవ్‌ని పుతిన్ చుట్టుముట్టవచ్చు. కానీ ఉక్రెయిన్ల మనసులు మాత్రం ఎప్పటికీ గెలుచుకోలేరన్నారు. ఉక్రెయిన్ల సంకల్పాన్ని ఎప్పటికీ బలహీనపరచేరన్నారు.














