Skip to main content

Namaste NRI

ఒకవేళ అదే జరిగితే .. ఆ దేశానికి పెను విపత్తు

మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత తమకేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఇరాన్‌లో తాము పెట్టుబడులు పెట్టబోమని స్పష్టం చేశారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని సముపార్జించుకోకుండా చూడడమే ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశమని అంటూ ఒకవేళ అదే జరిగితే ఆ దేశానికి పెను విపత్తు తప్పదని హెచ్చరించారు. ఇరాన్‌తో ఒప్పందం రెండో దశకు చేరుకుంటోందని ఆయన అన్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరింది. అది విజయవంతం అవ్వాలి. అప్పుడు రెండో దశకు వెళుతుంది. అది తేలికగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను అని జీ-7 సదస్సు సందర్భంగా విలేకరులతో అన్నారు.

కాగా ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమం స్విట్జర్లాండ్‌లో జరుగుతుందని, దీనికి తమ దేశం తరఫున చర్చల ప్రతినిధి మహమ్మద్‌ బాఘర్‌ ఘలీబఫ్‌ హాజరవుతారని ఇరాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజీద్‌ తక్త్‌-రవంచి అంతకుముందు తెలిపారు. ఒప్పందంపై స్విట్జర్లాండ్‌లోనే సంతకాలు జరుగుతాయని, అయితే ఏ ప్రదేశంలో జరిగేదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. సంతకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే తదుపరి విడత చర్చలు మొదలవుతాయని అన్నారు. అమెరికా తరఫున చర్చలలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాల్గంటారని తెలిపారు.

Social Share Spread Message

Latest News