కేంద్ర కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్నారు. నేడు ఆయన హైదరాబాద్ నగరానికి రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు కిషన్‌రెడ్డి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతకు తొలిసారిగా కేబినెట్ హోదా లభించిన తర్వాత నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై మాజీ ఎంఎల్‌ఏ చింత రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఎనిమిది మంది నేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 18న కిషన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చింతల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో చరిత్రలో తొలిసారిగా కేబినెట్ హోదా కిషన్‌రెడ్డికి దక్కడం ఎంతో గర్వకారణమన్నారు. పనిచేసేవారికి పట్టం కట్టాలి అన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం అభినందనీయమన్నారు. కేంద్ర కేబినెట్‌లోకి కిషన్ రెడ్డి తీసుకోవడం తెలంగాణకే గర్వకారణమని, తెలంగాణ సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం కిషన్‌రెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఆ శ్రమను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.