యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సర్వేశ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం, స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలతోపాటు ప్రత్యేక సుదర్శన నారసింహహోమం నిర్వహించారు.