తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలను ప్రస్తావించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి అధ్యక్షతన ఇండస్ట్రీ ప్రముఖలు ఈ నెలాఖరున కలవనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా అందింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి ఏ సమస్యలను తీసుకుకెళ్లాలో చర్చించుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఏప్రిల్ నెలలో టికెట్ ధరలపై ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలు.. చిన్న సినిమా మనుగడ కోసం ఐదో ఆట, నిర్మాణం, పంపిణీ ప్రదర్శన విభాగాల్లో ఉన్న సమస్యలు తదితర విషయాలపైన చర్చించారు. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నటులు నాగార్జున, నిర్మాతలు కేఎస్ రామారావు, సురేష్‌బాబు, అల్లు అరవింద్, సి.కల్యాణ్, స్రవంతి రవికిశోర్, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, ఏషియన్ సునీల్, విక్కీ, వంశీ, సుప్రియతో పాటు దర్శక`నిర్మాత ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. ప్రముఖ దర్శకులు కొరటాల శివ, వీవీ వినాయక్ కూడా హాజరయ్యారు. ఇంకా సమావేశంలో ఎగ్జిబిషన్, పంపిణీ రంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.