రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ లో మరోసారి పర్యటించనున్నారు. పుతిన్ గత ఏడాది డిసెంబర్‌లో భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి పుతిన్ ఇండియా రానుండటం విశేషం. వచ్చే సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పుతిన్ పాల్గొంటారు. ఈ ఏడాది జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఇండియా ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు పుతిన్ హాజరవుతారని రష్యా ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు ఇరాన్ విదేశాంగ మంత్రితోపాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెర్గీ లావ్రోవ్, ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కలయిక అని అర్థం. మొదట ఇందులో సౌతాఫ్రికా లేదు. అప్పట్లో బ్రిక్ అని పిలిచేవారు.





























