తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు బాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తుండగా, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మిస్తున్నారు.హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు లారాకి కృతజ్ఞతలు. నిర్మాత ప్రఫుల్ రాంరెడ్డి మాకు కుటుంబ పెద్దలాంటివారుఅని అన్నారు. ఈ కథ విన్న వెంటనే ఇది జాతీయ అవార్డు స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది అని హీరోయిన్ వర్షిక తెలిపారు.

దర్శకుడు లారా మాట్లాడుతూ చరిత్రలో మరుగున పడిపోయిన ఓ భావోద్వేగ కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సర్కారు బాయి వద్ద అణగారిన వర్గాలకు నీళ్లు ఇవ్వకుండా జరిగిన అన్యాయాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాథ ఈ చిత్రానికి మూలకథ. 1985లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు, కుల వివక్ష, సామాజిక అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తెలంగాణలో జరిగిన ఓ హృదయ విదారక సంఘటనను తెరపై ఆవిష్కరిస్తున్నాంఅని తెలిపారు. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సమాజానికి సందేశాన్ని అందించే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం అని నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి చెప్పారు.





























