Skip to main content

Namaste NRI

మహా కుంభమేళాలో తొక్కిసలాట…మృతుల సంఖ్య ఎంతంటే

ప్రయాగరాజ్‌లోని మహా కుంభమేళా (2025)లో మౌని అమావాస్య పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మౌని అమావాస్య పవిత్ర స్నానాలకు సంగం నది దగ్గరకు ఇసుకవేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. రెండో సాహి స్నాన్ కోసం మంగళవారం రాత్రి నుంచే భక్తులు పెద్దఎత్తున సంగం నది వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా ఊహించని సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది.

ఘటనపై మహాకుంభ్‌నగర్ డీఐజీ వైభవ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ మహాకుంభ్ తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెల్లవారుజామున 1-2 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని తెలిపారు. మృతుల్లో 25 మంది గుర్తించామని, మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందని వివరించారు. మృతుల్లో ఇతర రాష్ట్రాలు వారు కూడా ఉన్నారని, నలుగురు కర్ణాటక, ఒకరు అస్సాం, ఒకరు గుజరాత్‌కు చెందిన వారున్నట్టు చెప్పారు. గాయపడిన 36 మంది స్థానిక మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం హెల్ప్‌లైన్ నెంబర్ 1920 అందుబాటులో ఉందని చెప్పారు. అఖాడా ప్రాంతానికి భక్తులు పెద్దఎత్తున రావడం, కొందరు తమ వంతు వచ్చేంతవరకూ వేచిచూసేందుకు అక్కడే పడుకోవడం, వారి మీద నుంచి భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు.

Social Share Spread Message

Latest News