Namaste NRI

 సూపర్‌స్టార్‌ కృష్ణ ఇక లేరు… శోకసంద్రంలో టాలీవుడ్

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్ల‌వారుజామును ఆయన తుదిశ్వాస విడిచారు. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు.

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్‌ చేయాలనుకున్నారు. కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.

1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది.  నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్‌లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ‘డేరిండ్‌ అండ్‌ డాషింగ్‌’ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు.

కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.

Social Share Spread Message

Latest News