టోక్యో నగరం వేదికగా 16వ పారాలింపిక్స్ గేమ్స్‌కు తెరలేచింది. ఒలింపిక్ స్టేడియం వేదికగా ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలకు జపాన్ చక్రవరి నరుహిటో, ప్రధాని సుగా హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఒలింపిక్స్ లాగే పారాలింపిక్స్ కూడా ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే జరుగనున్నాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు (13 రోజుల) పాటు జరిగే ఈ విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. వీ హావ్ వింగ్స్ అనే థీమ్ ప్రధానంశంగా ఆరంభం వేడుకలు జరిగాయి. వైకల్యం తమ శరీరానికే కాని ఆత్మసైర్యానికి కాదని నిరూపించేందుకు వివిధ దేశాల దివ్యాంగులు ఆకాశమే హద్దుగా తమ ప్రతిభను చాటచేప్పేందుకు బరిలోకి దిగుతున్నారు.
ఒక విమానంలో తరహాలో ప్రతి మనిషికి రెక్కలు ఉంటాయని, ఎక్కడికైనా విహరించవచ్చన్న ప్రధాన ఉద్దేశంతో పోటీలకు తెరలేచాయి. 22 క్రీడలకు సంబంధించిన 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పతకాలే లక్ష్యంగా భారత్ నుంచి 54 మంది పారా అథ్టెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో భారత త్రివర్ణ పతాకాన్ని జావెలిన్ త్రోయర్ టెక్ చంద్ చేతబూని మన దేశ బృందాన్ని నడిపించాడు. జపాన్ చక్రవర్తి నరుహిటో పోటీలు ప్రారంభమయ్యాయని ప్రకటించగానే టోక్యో స్టేడియం పట్టాకుల వెలుగు, జిలుగుల మధ్య తళుకులీనింది. తొలుత శరణార్థుల జట్టు స్టేడియంలో అడుగుపెట్టింది. టోక్యో పారాలింపిక్స్ ప్రత్యక్ష ప్రసార వేడుకలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. భారత జట్టు వచ్చినప్పుడు మోదీ నిలబడి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.