90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని అండర్ వరల్డ్ మాఫియా శాసించే పరిస్థితులు ఉండేవి. బలవంతపు వసూళ్లు, బెదిరింపులతో మాఫియా డాన్‌లు చెలరేగిపోయేవారు. మరలా బాలీవుడ్‌లో మాఫియా కదలికలు కనిపించడం ఆందోళనకరంగా మారింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు సైతం ముంబయి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో ఆరుగురు సాయుధ సిబ్బంది నిరంతరం షారుఖ్‌ఖాన్ భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు షారుఖ్. ఈ నేపథ్యంలో అండర్ వరల్డ్ మాఫియా నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షారుఖ్‌ఖాన్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.














