వెంకటేశ్‌కి జోడీగా శ్రీనిధిశెట్టి నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ఆదర్శకుటుంబం -హౌస్ నెం.47. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానున్నది. హైదరాబాద్‌లో విలేకరులతో శ్రీనిధిశెట్టి మాట్లాడారు. ఈ ఆఫర్ నా వద్దకొచ్చినప్పుడే ఇందులో నాది అమ్మ పాత్ర అని చెప్పారు. అయినప్పటికీ నో చెప్పాలనే ఆలోచన నాకు కలుగలేదు. అసలు వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో నటించడమే అదృష్టం. పైగా కథ విన్నాక ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి అనిపించింది. అందుకే ఆలోచించకుండా ఎస్ చెప్పేశా అని అన్నారు.

త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయడం నా డ్రీమ్. అలాంటిది ఆయన నుంచి కాల్ రావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది క్రైమ్ కామెడీ మూవీ. నేను తొలిసారి కామెడీ చేశాను. చిట్‌ఫండ్‌లో డబ్బు పోగొట్టి, ఊరంతా అప్పులు చేస్తాను. నా కెరీర్లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. వెంకటేశ్ గొప్ప నటుడు. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌నీ మ్యాచ్ చేయడం కష్టం. త్రివిక్రమ్ సూచనలతో కామెడీని సహజంగా చేసేందుకు ట్రై చేశా. త్రివిక్రమ్ డైలాగ్స్‌లో చక్కని భావం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని నటించాను. ఈ సినిమాలో త్రివిక్రమ్ రైటింగ్ మ్యాజిక్ చేస్తుంది. చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్? అనే డైలాగ్ నాతో పాటు అందరికీ నచ్చింది అంటూ పేర్కొన్నది శ్రీనిధిశెట్టి. ఇటీవలే సినిమా చూశానని, అద్భుతం అనిపించిందని ఈ సినిమాలో కామెడీ ఎంత ఎంజాయ్ చేస్తారో, యాక్షన్‌ని కూడా అంతే ఎంజాయ్ చేస్తారని శ్రీనిధి తెలిపింది.















