అమెరికా విదేశాంగశాఖలో భారత సంతతికి చెందిన గీతా రావు గుప్తా కు కీలక బాధ్యతలు దక్కాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్ కార్యాలయానికి ఆమె అంబాసిడర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గీత భర్త అరవింద్ గుప్తా, కుమార్తె నయన గుప్తా, కోడలు మంజులీ మహేశ్వరి, స్నేహితురాలు కరోలినా రోజస్ కూడా హాజరయ్యారు. ఇక ఈ పదవికి ఎంపికైన తొలి శ్వేతజాతీయేతర మహిళగా గీతా రావు చరిత్ర సృష్టించారు. కాగా, గీతా రావు నియామకాన్ని మే నెలలో అమెరికన్ సెనేట్ 51–47 ఓట్ల తేడాతో ధ్రువీకరించిన విషయం విదితమే.














