బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అమెరికాలో తెలుగు ప్రజలు తీవ్ర తంటాలు పడుతున్నారు. బియ్యం కొనేందుకు పలు షాపుల వద్ద ఎన్నారైలు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అయితే బియ్యం కోసం ఎన్నారైలు ఎగబడ్డారు. ఒకేసారి పదుల సంఖ్యలో బియ్యం బ్యాగులు కొనుగోలు చేస్తున్నారు. బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందోనన్న భయంతో అవసరానికి మించి కూడా కొందరు ఎన్నారైలు బియ్యం కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది.

ఈ పరిస్థితిని గమనించిన దుకాణదారులు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కరికి ఒక్క బియ్యం బ్యాగ్ మాత్రమే విక్రయిస్తామని బోర్డుల్లో రాసిపెట్టారు. 15 డాలర్ల విలువ చేసే కిరాణ సామాన్లు కొంటేనే బియ్యం బ్యాగు కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక కస్టమర్‌ను ఒక్కసారి మాత్రమే షాపులోకి అనుమతిస్తామని చెప్పారు. సోనా మసూరిలో ఏ రకం బియ్యం తీసుకున్నా, ఒక్క కుటుంబానికి ఒక్క బియ్యం బస్తా మాత్రమే విక్రయిస్తామన్నారు. భారతదేశం ప్రధానంగా థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాకు సన్న బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో పంటల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బియ్యాన్ని కొద్దిరోజుల పాటు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.














