ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. యెమెన్‌లో వారి అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. సుమారు 16 ప్రదేశాల్లో 60 టార్గెట్లను ధ్వంసం చేశాయి. అయితే, ఈ దాడులపై హౌతీ రెబల్స్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులకు అమెరికా, బ్రిటన్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అదే సమయంలో ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ఆపబోమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వైపు వెళ్లే వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగిస్తామని హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి ప్రకటించారు.














