టూరిజం వివాదం నేపథ్యంలో మాల్దివుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ భారత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడు. ద్వీపదేశం నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశానికి డెడ్‌లైన్ విధిస్తూ అల్టిమేటం ఇచ్చాడు. భారత సైనిక సిబ్బంది మార్చి 15లోగా దేశం విడిచి వెళ్లాలని సూచించాడు. చైనాలో ఐదు రోజుల పర్యటన నుంచి స్వదేశం తిరిగివచ్చిన వెంటనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాం శమైంది. జిన్‌పింగ్‌తో కీలక భేటీ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
మయిజ్జూ కార్యాలయంలోని పబ్లిక్ పాలసీ సెక్రటరీ అబ్దుల్లా నజీమ్ ఇబ్రహం మాట్లాడుతూ భారత సైనిక సిబ్బంది ఇకపై మాల్దివులలో ఉండటానికి వీల్లేదు. ఇది అధ్యక్షుడు డా.మహమ్మద్ ముయిజ్జూ ఈ పరిపాలన విధాన నిర్ణయం అని చెప్పారు. దాదాపు 88 మంది భారత సైనికులు మాల్దివులలో ఉన్నారు. మాల్దివుల అధ్యక్షుడిగా మయిజ్జూ పగ్గాలు చేపట్టిన రెండు నెలల తర్వాత భారత దళాలను ఉపసంహరించుకోవాలని ఆ దేశం పిలుపునిచ్చింది.














