అమెరికాలో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకోగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రేయాస్ రెడ్డి మృతికి కారణాలు తెలియ రాలేదని పోలీసులు పేర్కొన్నారు. అంతకు మించిన వివరాలేమి వెల్లడించలేదు. శ్రేయాస్ రెడ్డి సిన్సినాటి లోని లిండర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి. శ్రేయాస్ రెడ్డి మృతిపై న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ స్పందించింది. ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. పోలీసుల విచారణ జరుగుతోంది. అతని మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శ్రేయాస్ రెడ్డి కుటుంబంతో టచ్‌లో ఉన్నట్లు ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది.
ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘటన. 2024 ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలోనే అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. నీల్ ఆచార్య, వివేక్ షైనీ, ఆకుల్ ధావన్ అనే ముగ్గురు విద్యార్థులు జనవరి నెలలో చనిపోయారు.














