ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగు సాహిత్య వేదిక నెలనెల తెలుగు వెన్నెల 211వ సాహిత్య సదస్సు ఫిబ్రవరి 16న కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు అంశంపై డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. లెనిన్ వేముల ప్రార్థన గేయాలాపనతో సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ కవి కీ.శే. వడ్డేపల్లి కృష్ణ రాసిన రికార్డు చేసిన నెలనెల తెలుగు వెన్నెల గీతాన్ని కూడా వినిపించారు. దయాకర్ మాడ ముఖ్య అతిథిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ మంగారి రాజిందర్ జింబో మాట్లాడుతూ తన కథారచన వైశిష్ట్యాన్ని వివరించారు. ముఖ్యంగా ముద్రిత పుస్తకాలు నేను నా నల్లకోటు, మనసు పెట్టి, కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు, మా వేములవాడ కథలు లో రాసిన కథలు జనజీవనంలోని విభిన్నపాత్రలతో రూపొందించడం జరిగిందన్నారు.

సాహితీ ప్రియులను భాగస్వాములను చేస్తూ గత 81 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక మన తెలుగు సిరి సంపదలు చాలా బాగా జరిగింది. తెలుగు భాషా పదసంపదను స్పృశించడం, అక్షర పద భ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పలువురు ప్రశంసించడం జరిగింది. అనంతరం శాస్త్రీయ సంగీత నిష్ణాతులు, రాగ విశ్లేషకులు పి.చంద్రమౌళి రచించిన ఘంటసాల రాగశాల పుస్తకాన్ని మద్దుకూరి చంద్రహాస్ పరిచయం చేశారు. నేపథ్య గాయకుడుగానే కాకుండా సంగీత దర్శకులుగా కూడా అద్బుతమైన రాగాలను సృష్టించిన ఘంటసాల గురించి చంద్రమౌళి కొత్త కోణాల్లో స్పృశించి రచించడం జరిగిందని మద్దుకూరి చంద్రహాస్ అన్నారు. లెవిన్ వేముల శత పద్యాలు పురాణ కథలు అంశంపై ప్రసంగిస్తూ మహాకవి వేమన పద్యమైన ఉప్పుకప్పురంబులోని పురుషులందు పుణ్యపురుషులెవరయా అనే పొలికకు ఒక ఉదాహరణ వాలి సుగ్రీవుల వృత్తాంతాన్ని గురించి చెప్పారు. ఈ సందర్భంగా సుగ్రీవతారల ఆదర్శ అనురాగ బంధాన్ని గోరటి వెంకన్న గేయంలో నుంచి గానం చేశారు.

తాను కుటుంబ సమస్యలను పరిష్కరించే న్యాయమూర్తిగా ఉన్నపుడు కొందరి జీవితాలలో వారికి ఎదురైన సంఘటనలు తన దృష్టికి రావడంతో ఆయా కేసులతో యదార్థ సంఘటనలు మూలంగా తీసుకొని రాసిన అనేక కథలు నిర్ణయం, ఆమె కోరిక, సంతృప్తి, చల్లగుండు సత్తెమ్మా, నేల టిక్కెట్టు, ఆఖరి చూపు, కాశమ్మ కథ, ఊరుంది. గాయం ఇకలేరు, రుక్కమ్మ హోటల్ మొదలైన అనేక కథల గురించి వివరించారు. తాను న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో చాలా తీర్పులు తెలుగులో ఇచ్చానని పేర్కొన్నారు.

డాక్టర్ మంగారి రాజేందర్ జింబో ప్రసంగాన్ని మెచ్చుకుంటూ డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్బు జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, కొండా తిరుమల రెడ్డి, లెనిన్ వేముల, దయాకర్ మాడ, కాశీనాధుని రాధ, రామ సీతామూర్తి, నిడిగంటి గోవర్ధనరావు తదితర సాహితీ ప్రియులు తమ స్పందనను తెలిపారు.ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున తక్షణ పూర్వాధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి డాక్టర్ మంగారి రాజేందర్ జింబో కి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది.

ఈ సాహిత్య కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన ముఖ్య అతిథి డాక్టర్ రాజేందర్ జింబో తోపాటు వారి కుటుంబ సభ్యులు అనురాగ్ మంగారి, రాకేష్ మంగారి, దీపక్ రాజా రోజనాల ఇంకా సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, శ్రీ చిన్న సత్యం వీర్నాపు, శ్రీ నివాస కుమారస్వామి రాజ, వారి సతీమణి పద్మజ, శ్రీ విజయ్ మందిరం, లెనిన్ తాళ్లూరి, లెనిన్ బంద, లెనిన్ వేముల, రాఘవేంద్ర అమిలినేని, సతీష్ గ్రంధి, శ్రీమతి శ్రీ రామ్ సీతా మూర్తి, శ్రీధర్ నంబూరు, గోవర్ధన రావు నిడిగంటి వంటి అనేక మంది సాహితీ ప్రియులు వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది.సమన్వయకర్త దయాకర్ మాడ వందన సమర్పణ చేశారు.

కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి, సంస్థ తక్షణ పూర్వాధ్యకులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనలు తెలపడంతో కార్యక్రమం ముగిసింది.















