అమెరికాలోని ప్రముఖ హిందూ దేవాలయం ఇస్కాన్‌పై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉటా రాష్ట్రంలోని స్పానిష్ ఫోర్క్ లో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. భక్తులు ఆలయంలో ఉన్న సమయంలో దాదాపు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆలయ గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరింది. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. ఉటాలోని స్పానిష్ ఫోర్క్‌లో గల ఇస్కాన్ శ్రీశ్రీరాధా కృష్ణ ఆలయంలో జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆలయ అధికారులకు, భక్తులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నాము. దాడికి పాల్పడిన నేరస్థులను గుర్తించి శిక్షించాలి అని కాన్సులేట్ పేర్కొంది.

ఈ కాల్పుల ఘటనలో ఆలయ స్వాగత తోరణాలు, గోడలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోడల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం సాధారణ దాడి కాదని, హిందూ సమాజంపై విద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఇస్కాన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.















