అమెరికాతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరినప్పటికీ యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది. తాము ప్రతిపాదించిన 10 సూత్రాలకు ఆమోదం లభించినప్పుడు మాత్రమే యుద్ధానికి ముగింపు లభిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన చర్చలు పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో ఈ నెల 10వ తేదీన చర్చలు ప్రారంభమవుతాయని తెలిపింది. తమకు అమెరికాపై నమ్మకం లేదని, అయినప్పటికీ ఈ చర్చల కోసం రెండు వారాల సమయం ఇచ్చామని పేర్కొంది. అవసరమైతే పరస్పర అంగీకరాంతో గడువు పొడిగించే అవకాశం కూడా ఉందని చెప్పింది.

ఈ చర్చల్లో శత్రువు లొంగిపోవడం ఒక నిర్ణయాత్మక రాజకీయ విజయంగా మారితే, ఈ గొప్ప చారిత్రక విజయాన్ని మనందరం కలిసి జరుపుకుందామని ఇరాన్ ప్రజలను ఉద్దేశించి సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్యూరిటీ తెలిపింది. లేదంటే ఇరాన్ జాతి డిమాండ్లు నెరవేరే వరకు భుజం భుజం కలిపి పోరాడదామని సూచించింది. మా చేతులు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి. శత్రువు చేసే చిన్న పొరపాటును కూడా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.















