
అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) కొత్తగా కఠినమైన సంతక ధ్రువీకరణ విధానాన్ని అమలు చేయనుంది. దీని వల్ల హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, గ్రీన్‌కార్డు కోరుకునే వారు, విదేశీ కార్మికులను స్పాన్సర్ చేసే యజమానులపై తీవ్ర ప్రభావం పడనుంది. సిగ్నేచర్ మిస్ అయితే వీసాను తిరస్కరించే అవకాశం ఉన్నది. అభ్యర్థులు చేతితో చేసిన సంతకం, స్కాన్డ్, ఫ్యాక్స్‌డ్, ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్‌లను వినియోగించాలి. కాపీ-పేస్ట్, డిజిటల్, స్టాంప్డ్ వర్షన్‌లకు దూరంగా ఉండాలి. యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ శాఖ జారీ చేసిన ఈ తాత్కాలిక తుది నిబంధన ప్రకారం యూఎస్‌సీఐఎస్‌కు అపరిమితమైన అధికారాలు సంక్రమిస్తాయి. వీసా ప్రక్రియ కోసం అప్పటికే అనుమతించినా కూడా తర్వాత ఆ దరఖాస్తులు చెల్లినివిగా గుర్తిస్తే వాటిని తిరస్కరించే, నిరాకరించే హక్కు వారికి ఉంటుంది. మే 11న ఫెడరల్ రిజిస్టర్‌లో ముద్రించిన ఈ నిబంధనలు ఈ ఏడాది జూలై 10 నుంచి అమల్లోకి వస్తాయి.





























