ప్రపంచ ద్రవ్యోల్బణం గురించి ఆలోచిస్తే మొదటగా మనకు గుర్తుకు వచ్చే పదం చమురు. అదే విషయం గురించి డొనాల్డ్ ట్రంప్‌ను అడిగితే ఆయన చమురుకు హొర్ముజ్ జలసంధిని జతచేస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం తగ్గుముఖం పట్టినప్పటికీ మరో కొత్త ముప్పు ప్రపంచానికి ముంచుకు వస్తున్నది. అదే కంప్యూటర్ చిప్‌లలో వాడే ర్యామ్. దాని లభ్యత, ధర సాంకేతిక ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల కంటే కంప్యూటర్ చిప్‌లలో వాడే మెమరీ(ర్యామ్), స్టోరేజ్(న్యాండ్) ధరలు ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను పెంచే ప్రమాదం కనిపిస్తున్నది.

టెక్నాలజీ రంగంలో ఏర్పడిన ఈ కొరత వల్ల ఇప్పటికే యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచాయి. భారత్‌లో కొన్ని యాపిల్ ఉత్పత్తుల ధరలు ఏకంగా 85 శాతం మేర పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మ్యాక్బుక్లు, ఐప్యాడ్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతానికి ఐఫోన్ దీనికి మినహాయింపుగా ఉన్నప్పటికీ సెప్టెంబర్‌లో కొత్త మోడల్ విడుదలైనపుడు దాని ధర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గత 3,4 ఏండ్లలో ర్యామ్, స్టోరేజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. చాలా సందర్భాల్లో ఈ ధరల పెరుగుదల రెట్టింపునుండి నాలుగు రెట్ల వరకు ఉంది. ర్యామ్, న్యాండ్ సరఫరాదారులు లేదా కొనుగోలుదారుల ఆర్థిక నివేదికలను పరిశీలించాల్సిన అవసరం లేకుండానే ఈ ధరల పెరుగుదలను అర్థం చేసుకోవడానికి అమెజాన్‌లో ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లేదా ల్యాప్‌టాప్ మెమరీ కోసం ఒకసారి వెతికితే చాలు. 2024లో రూ. 5,000కు లభించే వస్తువు ధర ఇప్పుడు దాదాపు రూ. 15,000కు చేరింది.





























