ఐటీ- ప్రోఫెషనల్స్ కోసం భారతీయులకు హెచ్-1బీ, ఎల్ 1 వీసాల జారీకి ప్రాధాన్యం ఇస్తామని అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ చెప్పారు. అమెరికాలోని టెక్ కంపెనీలకు విదేశీ టెక్ నిపుణుల కోసం జారీ చేస్తున్న నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హెచ్-1బీ వీసా. భారతీయులు, చైనీయులపైనే అమెరికా టెక్నాలజీ కంపెనీలు పూర్తిగా ఆధార పడ్డాయి. లక్షల మంది ఐటీ నిపుణులు ప్రతి ఏటా ఈ రెండు దేశాల నుంచే అమెరికాకు వెళుతుంటారు. ఈ ఏడాది పది లక్షలకు పైగా వీసాల జారీకి చర్యలు చేపట్టామని డొనాల్డ్ లూ తెలిపారు. ఇది విద్యార్థి వీసాలు, ఇమ్మిగ్రెంట్ వీసాల్లో రికార్డుగా నిలుస్తుందన్నారు.

ఇతర విభాగాల్లో ప్రత్యేకించి బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) క్యాటగిరీ వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్న భారతీయులు సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్నారు. వీసాల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి రావడం భారతీయుల్లో ఆందోళనను పెంచుతున్నది. అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ రెండో స్థానంలో నిలుస్తుంది.

మేం వర్క్ వీసాలు హెచ్-1బీ, ఎల్1 వీసాల జారీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. భారతీయులకు ఇప్పుడు 60 రోజుల్లోపు వీసాలు జారీ చేస్తున్నాం. ఇందుకోసం అదనపు కాన్సులేట్ ఆఫీసర్లను నియమిస్తున్నాం. మా ఈ నిర్ణయం వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది అని డొనాల్డ్ లూ తెలిపారు.





























