అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ పదవిని మొట్టమొదటి సారిగా ఓ మహిళ చేపట్టనుంది. న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో లైంగిక వేధింపుల ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. క్యూమో రాజీనామా అనంతరం గవర్నర్ పదవిని కాథీ హోచుల్ చేపట్టనున్నారు. దీంతో 233 ఏళ్ల న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదు కానుంది. న్యూయార్క్ మొదటి మహిళా గవర్నర్‌గా ఆమె చరిత్రకెక్కనున్నారు. రాజకీయ వారసత్వం ఉన్న క్యూమో, తన తండ్రిలాగే మూడుసార్లు గవర్నర్‌గా ఎన్నికయ్యారు. క్యూమో నాలుగేళ్ల గవర్నర్ పదవీకాలం 2022 డిసెంబర్‌తో ముగియనుంది.
క్యూమో రాజీనామా సందర్భంగా నా వల్ల మానసికంగా మనస్తాపం చెందిన మహిళలకు క్షమాపణ చెబుతున్నాను. నాకు ప్రజలతో ఎక్కువ పరిచయాలుంటాయి. నేను మామూలుగా మహిళలనైనా పురుషులనైనా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాను. అయితే ఈ సంస్కృతి అందరికీ నచ్చదు. తరాలు మారడంతో సాంస్కృతిక మార్పులు చోటు చేసుకున్నాయి. సాంస్కృతికంగా వచ్చిన ఈ మార్పును నేను సాకుగా చెప్పదలచుకోలేదు అని అన్నారు. క్యూమో అనుచితంగా తాకారని, లైంగిక వ్యాఖ్యలు చేశారని, అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నారని మహిళలు ఆరోపించారు. న్యూయార్క్ అటర్నీ జనరల్ కార్యాలయం స్వతంత్ర దర్యాప్తులో కూడా ఉద్యోగులతో సహా 11 మంది మహిళలను క్యూమో లైంగింకంగా వేధించినట్లు తేలింది.