భారత ప్రభుత్వం రెండో విడత పాస్‌పోర్టు సేవా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు ఆధునికీకరించిన ఈ-పాస్‌పోర్టులు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. నమ్మకమైన, సమర్థవంతమైన పాస్‌పోర్టు సేవలను సమయానికి అందించేలా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


ప్రధాని మోదీ పేర్కొన్న ఈజ్ ఆఫ్ లివింగ్ విధానంలో భాగంగా రెండో విడత పాస్‌పోర్టు సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి జైశంకర్ తెలిపారు. దీంతో, భారత్‌లో పాస్‌పోర్టు సేవలకు సంబంధించి ఓ కొత్త ఒరవడి మొదలవుతుందని పేర్కొన్నారు. పాస్‌పోర్టు సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. 2022లో విదేశాంగ శాఖ రికార్డు స్థాయిలో 13.32 మిలియన్ పాస్‌పోర్టు దరఖాస్తులు, ఇతర సంబంధిత సేవలను అందించిందని పేర్కొన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 63 శాతం అధికమని చెప్పారు.















